ఈ కధ మా పిల్లలకి చాల ఇష్టం. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.
అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడు. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాదించి బాదంకాయంత బంగారం కొనుక్కుని తన ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేసాడు.
ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఓ దోసకాయంత దొంగ మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇంట్లోకి వచ్చి, గచ్చకాయంత గదిలో, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు.
ఆ రోజు సాయంత్రానికి మిరపకాయ్ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి అతను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకుని, వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు.
వెంటనే, ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి వెళ్లి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని, వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని తీసుకొని మిరపకాయ పొట్టోడికి ఇచ్చి,
ఆ దోసకాయంత దొంగోడిని నాలుగు తన్ని జామకాయంత జైల్లో పడేస్తాడు.
అప్పుడు మిరపకాయ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి, తన ఈతకాయంత ఇంటికెళ్ళి, గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, దానికి తిరిగి తాటికాయంత తాళం వేస్కుని దాచేస్తాడు.
ఇదీ కధ!
No comments:
Post a Comment