Showing posts with label Small Stories. Show all posts
Showing posts with label Small Stories. Show all posts

Saturday, June 10, 2017

సింగినాదం - జీలకర్ర

సింగినాదం - జీలకర్ర

కొన్ని సందర్భాల్లో
మనకు తెలియకుండానే
తెలుగులో కొన్ని నానుడులు
అసంకల్పితంగా
అనేస్తూ ఉంటాము....

కాని వాటి వెనుక
ఉన్న అసలు
అర్ధం చాలామంది కి
తెలియదు...

ఈ రోజు
సింగినాదం జీలకర్ర
అనే నానుడి వెనుక
దాగి ఉన్న అంతరార్ధం
తెలుసుకుందాం....

ఒకప్పుడు
ఓ రాజ్యంలో
జీలకర్రకు
విపరీతమైన
కొరత ఏర్పడింది...

ప్రజలందరూ
జీలకర్ర లేక చాలా
ఇబ్బందులు పడ్డారు..

ఇదే అదనుగా
వ్యాపారస్తులు
ఇతర దేశాల నుండి
జీలకర్రను దిగుమతి
చేసుకుని ఎక్కువ రేట్లకు
అమ్మడం మొదలు పెట్టారు....

ఈ విషయమై ప్రజలందరూ
తమ గోడును రాజు గారికి
విన్నవించుకున్నారు...

అప్పుడు రాజు గారు
మంత్రివర్గం తో
అత్యవసర సమావేశం
ఏర్పాటు చేసి
విదేశాలనుండి ఓడల
మీద జీలకర్రను తెప్పించి
మధ్యవర్తుల ప్రమేయం
లేకుండా డైరెక్ట్ గా ప్రజలకు
అమ్మే ఏర్పాటు చేశారు...

అయితే జీలకర్ర తో
కూడిన ఓడ...
రేవుకు చేరుకున్నవెంటనే
ఆ విషయం ప్రజలకు
తెలియచేయడానికి
ఓ ఏర్పాటు చేశారు...

అదే శృంగ నాదం...

శృంగ నాదం
అంటే ఒక సంగీత
వాయిద్య పరికరం...

ఒక విధంగా ఇది
బాకాను పోలి ఉంటుంది....
ఓడ,  రేవుకు చేరగానే
శృంగనాదం గట్టిగా ఊదడం
ద్వారా ప్రజలకు ఆ విషయాన్ని
తెలియ చేసెడి వారు...

ప్రజలు వెంటనే
ఓడ రేవుకు చేరుకుని
డైరెక్ట్ గా జీలకర్రను
కొనుక్కునే వారు...

మధ్య దళారుల
ప్రమేయం
లేక పోవడంతో
జీలకర్ర తక్కువ
రేటుకి లభించి ప్రజలు
ఆనందించారు...

ఇక అసలు
విషయానికి వస్తాను...

జీలకర్ర లేకపోవడం వల్ల
జనజీవనం అస్త వ్యస్తం
అయ్యే అంత పరిస్థితి
ఏమి ఉండదు...

అయినా రాజు గారు
దానికి అధిక ప్రాధాన్యాన్ని
ఇచ్చి లేనిపోని హడావిడి చేశారు...

అందుకే అప్పటి నుండి
ఎవరైనా అనవసర
విషయాలకు అధిక
ప్రాధాన్యాన్ని ఇస్తే

ఆ చేశావులే
శృంగానాదం జీలకర్ర
అనడం పరిపాటి అయినది...

కాలక్రమంలో
శృంగానాదం
కాస్త సింగినాదం గా
మారి....

సింగినాదం జీలకర్ర గా
మారింది...

ఈ విషయం చెప్పడానికి
నేను ఇంత మేటర్ ను
తెలుగులో తయారు చేసి
మీకు వాట్సాప్ లో
పోస్ట్ చేయడం అంత
అవసరం అంటారా...

సింగినాదం
జీలకర్ర కాకపోతేను....

Saturday, April 8, 2017

పిచ్చుక మూడు నీతి సూక్తులు : Telugu Short Story

*పిచ్చుక మూడు నీతి సూక్తులు*


అనగనగా ఒక రోజు ఒక వేట గాడి చేతికి ఒక చిన్న పక్షి(పిచ్చుక) దొరికింది . అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది.

"అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు, నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేమి ఉపయోగం?

నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయచేసి నాకు ప్రాణ బిక్ష పెట్టి నన్ను వదిలి వేయి.

అందుకు ప్రతి ఫలంగా నేను నీకు అమూల్యమయిన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషం గా సుఖంగా జీవించడానికి  ఎంతగానో  ఉపయోగపడతాయి."    

అది విన్న వేటగాడు క్షణం అలోచించి, నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగము లేదు అనుకుని, "సరే వదిలివేస్తాను ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు" అన్నాడు.

అప్పుడు  ఆ పిచ్చుక, "అయ్యా కానీ నాది ఒక షరతు, నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పు పై కూచుని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూచుని చెప్తాను అంది."   వేటగాడు సరే అని ఒప్పుకుంటాడు.

పిచ్చుక వేటగాడి చేతిలో కూచుని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తుంది ...
1) ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు.
అని చెప్పి, వేటగాడి చేతి లో నుండి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పై కూచుంటుంది.

అక్కడ నుండి ఫక్కున నవ్వి అంటుంది  "ఓరి మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు, నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువయిన వజ్రం ఉంది, అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలివేసావు ." 

అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలచుకుని ఏడవటం మొదలుపెడతాడు.
అయ్యో అంత విలువయిన బరువయిన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టి గట్టిగా ఏడవటం మొదలుపెడతాడు. 

అప్పడు  పిచ్చుక అంది, ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి, నేను ఇంతకు ముందే నీకు చెప్పాను

"ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు."

నీ పిడికిలి అంత కూడా లేని నేను, నా కడుపులో బరువయిన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా, రెండవ నీతి సూక్తి ఏమిటంటే

2) ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు.
అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మ పై కూచుంది.

వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. "లేదు, నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు."
పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూచుని ఉంది.

కాసేపటికి వేటగాడు తేరుకుని సరే, "ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు" అని గుర్తు చేసుకుని,  సరే ఇప్పుడు మూడవ సూక్తి ఏమిటో చెప్పు అంటాడు. 

అప్పుడు పిచ్చుక, ఎలాగూ నే చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు, మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు.

3) నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దు.
అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది.


Wednesday, May 11, 2016

పేను - పెసర చేను కధ - Penu Pesara chenu kadha

అనగా అనగా ఒక పేను ఉంది. అది పెసర చేను వేసుకుంది. ఆ చేను బాగా ఏపుగా పెరిగింది. గుత్తులు గుత్తులుగా పెసర కాయలు కాసింది .

ఆ దారిలో ఒకరోజు ఆ ఊరి రాజుగారు వెళుతూ ఆ పెసర చేను చూసారు. "అబ్బా! చాలా బాగా పెరిగింది. " అని
ఆ చేను ఎవరిదో వాకబు చేసారు. అక్కడే ఉన్నవాళ్ళు ఆ చేను పేనుది అని చెప్పారు .

రాజుగారు వెంటనే "పేనుదా!" అని పరిహాసంగా నవ్వుతూ మొత్తం చేను భటులతో కోయించుకొని తనతో తీసుకు వెళ్లారు. రాజుగారు వెళ్ళిన కొంతసేపటికి అక్కడికి పేను వచ్చి, జరిగిన విషయం తెలుసుకొని దాని ఏపుగా పెరిగిన చేను రాజుగారు అన్యాయంగా తీసుకువెళ్ళారు అని భాద పడింది.

అప్పుడు పేను రాజుగారిమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంది. అది రాజుగారి దగ్గరకి వెళ్ళాలి అని అనుకోని - దాని పొలం లో కింద పడి మిగిలిపోయిన పెసలు ఏరుకొని నాలుగు పెసరట్లు వేసుకుంది ప్రయాణంలో తినటం కోసం.

మర్నాడు ఉదయాన్నే లేచి ఆ నాలుగు పెసరట్లు పట్టుకొని, అందులో ఒక అట్టు తింటూ ప్రయాణం మొదలు పెట్టింది. అలా వెళ్ళగా వెళ్ళగా,  దానికి ఒక తేలు కనిపించింది.

ఆ తేలు "పేను బావా, పేను బావా! ఎక్కడికి వెళుతున్నావు?" అని అడిగింది. అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసర చేను రాజుగారు కోసుకు పోయారు, మగిలిపోయిన పెసలుతో నాలుగు పెసరట్లు వేసుకొని ఒకటి తింటూ , పగ తీర్చుకోటానికి వెలుతున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో తేలు నాకూ ఒక అట్టు ఇస్తే, నీకు నేను సహాయంగా వస్తాను  అని అంది. అప్పుడు పేను దానికి ఒక అట్టు ఇచ్చింది.  పేను, తేలు కలిసి  ప్రయాణం చెయ్యటం మొదలు పెట్టాయి.

అలా వెళ్ళగా వెళ్ళగా,  వాటికి ఒక పాము కనిపించింది.
ఆ పాము "పేను బావా, తేలు బావా! ఎక్కడికి వెళుతున్నారు?" అని అడిగింది.అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసర చేను రాజుగారు కోసుకు పోయారు, మగిలిపోయిన పెసలుతో నాలుగు పెసరట్లు వేసుకొని ఒకటి తింటూ , ఒకటి తేలు కి ఇచ్చి పగ తీర్చుకోటానికి వెలుతున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో పాము నాకూ ఒక అట్టు ఇస్తే, నీకు నేను సహాయంగా వస్తాను  అని అంది. అప్పుడు పేను దానికి ఒక అట్టు ఇచ్చింది.  పేను, తేలు, పాము కలిసి  ప్రయాణం చెయ్యటం మొదలు పెట్టాయి. 

అలా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా,  వాటికి ఒక పెద్ద పులి కనిపించింది.
ఆ పెద్ద పులి "పేను బావా, తేలు బావా, పాము బావా! ఎక్కడికి వెళుతున్నారు?" అని అడిగింది.అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసర చేను రాజుగారు కోసుకు పోయారు, మగిలిపోయిన పెసలుతో నాలుగు పెసరట్లు వేసుకొని ఒకటి తింటూ , ఒకటి తేలు కి ఇచ్చి, ఒకటి పాముకి ఇచ్చి, పగ తీర్చుకోటానికి వెలుతున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో పెద్ద పులి నాకూ ఒక అట్టు ఇస్తే, నీకు నేను సహాయంగా వస్తాను  అని అంది. అప్పుడు పేను దానికి ఒక అట్టు ఇచ్చింది.  పేను, తేలు, పాము, పెద్ద పులి వాటి వాటి రొట్టెలు తింటూ ప్రయాణం చేస్తూ వుండగా కొంతసేపటికి అవి రాజుగారి కోటకి చేరాయి. 

అప్పుడు పేను - తేలు, పాము, పెద్ద పులిలతో ఇలా అంది. 
"మిత్రులారా! నేను చెప్పినట్టు చెయ్యండి.  పెద్ద పులి బావా! నువ్వు కోట ముఖద్వారం దగ్గర నిలబడు, రాజుగారు ఇక్కడికి వస్తే నువ్వు నమిలి మింగేయి - పాము బావా నువ్వు ఆ కర్రల కట్ట కింద దాక్కో! రాజుగారు అటు వస్తే కరిచేయి - ఇంక తేలు బావా నువ్వు రాజుగారి అద్దం దగ్గర వున్న దువ్వెన కింద దాక్కో! రాజుగారు దువ్వెన కోసం వస్తే కుట్టేయి. "

ఇలా చెప్పి తేలు రాజుగారు పడుకునే వరకూ నిరీక్షించి అప్పుడు గడ్డం లో దూరి కుట్టడం మొదలు పెట్టింది. పేనుని వదిలించుకోటానికి రాజుగారు దువ్వెన కోసం వెళ్ళితే అక్కడ వున్న తేలు అతన్ని కుట్టింది. తేలుని చంపటానికి కర్ర కోసం రాజుగారు వెళ్లేసరికి అక్కడ వున్న పాము అతన్ని కరిచింది. పాము మంత్రం వేయించుకోటానికి కోట బయటకి వచ్చేసరికి అక్కడ వున్న పులి అతన్ని నమిలి మింగేసింది.

అలా పేను పగ తీరింది!

-------------------------

ఈ కధలో చిన్న స్థాయిలో వున్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టగలరో తెలుస్తుంది . అదే విధంగా పేను లాంటి చిన్న వాళ్ళని పెద్ద స్థాయిలో వున్నవాళ్ళు ఇబ్బందిలకి గురి చెయ్యకూడదు అని కూడా అర్ధమవుతుంది.

పేను తన పగ తీర్చుకోటానికి ఏవిధంగా తన పెసరట్లు పంచి పాము, తేలు, పెద్ద పులిలని తనవైపు తిప్పుకుందో కూడా గమనించాలి.

కధ కంచికి - మనం ఇంటికి!


Sunday, June 22, 2014

Telugu Small Story- Eedu chepala kadha - రాజు గారి పిల్లలు - ఏడు చేపలు కధ

అనగా అనగా ,

ఒక వూరిలో ఒక రాజుగారు వున్నారు. ఆ రాజు గారికి ఏడుగురు కొడుకులు వున్నారు. 

ఏడుగురు కొడుకులూ ఒక రోజు చెరువుకి వెళ్లి ఏడు చేపలు పట్టి తెచ్చి ఎండలో పెట్టారు.

సాయంత్రం చూసేసరికి ఆ ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.

"చేపా చేపా ఎందుకు ఎండలేదు ?" అని అడిగారు ఆ రాజుగారి కొడుకులు.

"నాకు గడ్డి వాము అడ్డు వచ్చింది" అని అంది ఆ చేప.

అప్పుడు రాజుగారి కొడుకులు గడ్డి వాము దగ్గరకి వెళ్లి "గడ్డి వాము గడ్డి వాము, ఎందుకు అడ్డు వచ్చావు?" అని అడిగారు.

అప్పుడు గడ్డి వాము "నన్ను ఆవు మేయ లేదు" అని అంది.

అప్పుడు రాజుగారి కొడుకులు ఆవు దగ్గరకి వెళ్లి "ఆవూ  ఆవూ, నువ్వు గడ్డివాముని  ఎందుకు మేయ్యలేదు?" అని అడిగారు.

అప్పడు ఆవు  "పెయ్య పాలు తాగలేదు" అని అంది.

అప్పుడు రాజుగారి కొడుకులు పెయ్య దగ్గరకి వెళ్లి "పెయ్యా పెయ్యా, నువ్వు పాలు ఎందుకు తాగలేదు?" అని అడిగారు.

అప్పడు పెయ్య "పాలెగాడు నన్ను వదలలేదు" అని అంది .

అప్పుడు రాజుగారి కొడుకులు పాలెగాడు దగ్గరకి వెళ్లి "పాలెగాడా పాలెగాడా, నువ్వు పెయ్యని ఎందుకు వదలలేదు?" అని అడిగారు.

అప్పుడు పాలెగాడు "పాప ఏడ్చింది" అని అన్నాడు

అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "పాపా పాపా, నువ్వు ఎందుకు ఎడ్చావు?" అని అడిగారు.

అప్పుడు పాప "నన్ను చీమ కుట్టింది" అని చెప్పింది.

అప్పుడు రాజుగారి కొడుకులు పాప దగ్గరకి వెళ్లి "చీమా చీమా, నువ్వు పాపని ఎందుకు కుట్టావు?" అని అడిగారు.

అప్పుడు చీమ ఏమనింది అంటే ... ఏమనింది అంటే ... "నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?"

అప్పుడు రాజుగారి పిల్లలకి ఒక సమస్య వెనక ఎన్నో సమస్యలు, కారణాలు వుంటాయి అని అర్ధమయ్యింది.

గమనిక: ఈ కధ లో పిల్లల మది లో ప్రశ్నలు ఎలా వస్తాయో, వాళ్ళకి కారణాలు తెలుసుకోవాలి అన్న అభిలాష ఎలా వుంటుందో పెద్దవాళ్ళకి అర్ధమవుతుంది.



 

Saturday, June 21, 2014

Eega Telugu Small Story - పేరు మరిచిపోయిన ఈగ కధ

ఇది ఇంకో కధ పిల్లలకి నచ్చుతుంది :

అనగా అనగా,

ఒక వూరిలో ఒక ఈగ వుండేది . అది ఇల్లు అలుకుతూ పేరు దాని మరిచిపోయంది.

అపుడు అది ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరకి వెళ్లి "పెద్దమ్మా పెద్దమ్మా ! నా పేరు ఏంటి అని అడిగింది".
అపుడు ఆ పేదరాశి పెద్దమ్మ "ఏమో ! నాకు తెలీదు ! అక్కడ చెట్టుని  కొడుతున్న మా అబ్బాయిని అడుగు" అని అంది .

అపుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - నా పేరు ఏంటి?" అని అడిగింది .

అపుడు వాడు "ఏమో ! నాకు తెలీదు ! నా చేతిలో వున్న గొడ్డలిని అడుగు" అని అన్నాడు.

 అపుడు ఆ ఈగ గొడ్డలి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - నా పేరు ఏంటి?" అని అడిగింది

అపుడు ఆ గొడ్డలి  "ఏమో ! నాకు కూడా తెలీదు ! నేను కొడుతున్న చెట్టును అడుగు" అని అంది.

అపుడు ఆ ఈగ చెట్టు మీద వాలి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - నా పేరు ఏంటి?" అని అడిగింది.

అపుడు ఆ చెట్టు "ఏమో ! నాకూ తెలీదు ! నా మీద వాలి వున్న పిట్టలని  అడుగు" అని అంది.

అపుడు ఆ ఈగ చెట్టు మీద వాలి వున్న పిట్టల దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలార - నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ పిట్టలు  "ఏమో ! మాకూ తెలీదు ! మమ్మల్ని పట్టుకోటానికి వచ్చే వేటగాళ్ళని అడుగు" అని అన్నాయి .
 
అపుడు ఆ ఈగ వేటగాళ్ళ దగ్గరకి  వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలార - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళారా నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ  వేటగాళ్ళు  "ఏమో ! మాకూ తెలీదు ! మాకు వంట చేసి పెట్టె అమ్మలక్కలని అడుగు" అని అన్నారు.

అపుడు ఆ ఈగ అమ్మలక్కల దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టె అమ్మలక్కలారా నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ  అమ్మలక్కలు  "ఏమో ! మాకూ తెలీదు ! ఇప్పుడే రాజుగారు వచ్చి అన్నం తిని అక్కడ పడుకున్నారు, ఆయన్ని అడుగు" అని అన్నారు.

అపుడు ఆ ఈగ రాజు గారి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ -  నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ  రాజు గారు  "ఏమో ! నాకు తెలీదు ! నేను ఎక్కి వచ్చిన గుఱ్ఱం ని అడుగు" అని అన్నారు.

అపుడు ఆ ఈగ రాజు గారి దగ్గరకి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ -  రాజుగారు ఎక్కి వచ్చిన గుఱ్ఱమా - నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ గుఱ్ఱం "ఏమో ! నాకేమీ తెలీదు ! నా బొజ్జలో ఉన్న గుఱ్ఱం పిల్లని అడుగు" అని అంది .

అపుడు ఆ ఈగ గుఱ్ఱం బొజ్జ మీద వాలి వెళ్లి "పేదరాశి పెద్దమ్మా - పెద్దమ్మ కొడుకా - పెద్దమ్మ కొడుకు చేతులో గొడ్డలా - గొడ్డలి కొడుతున్న చెట్టా - చెట్టు మీద వాలిన పిట్టలారా - పిట్టలని పట్టుకోటానికి వచ్చిన వేటగాళ్ళూ- వేటగాళ్ళకి వంట చేసి పెట్టే   అమ్మలక్కలు - అమ్మలక్కలు చేసిన వంట తిన్న రాజుగారూ -  రాజుగారు ఎక్కి వచ్చిన గుఱ్ఱమా - గుఱ్ఱం బొజ్జలో పిల్లా నా పేరు ఏంటి?" అని అడిగింది.

అప్పుడు ఆ గుఱ్ఱం పిల్ల "ఇహి... ఇహీ .. ఇహీ ... ఈగ "... అని అంది .

ఈగ కి దాని పేరు గుర్తుకి వచ్చి "నా పేరు ఈగ, నా పేరు ఈగ, నా పేరు ఈగ" అనుకుంటూ ఇల్లు అలుక్కోటానికి ఎగురుకుంటూ వెళిపోయింది.
 





.

Small Stories (చిట్టి కధలు) - Mirapakaya Pottodu (మిరపకాయ్ పొట్టోడు)


ఈ కధ మా పిల్లలకి చాల  ఇష్టం. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. 

అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడు. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాదించి బాదంకాయంత బంగారం కొనుక్కుని తన ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేసాడు. 

ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఓ దోసకాయంత దొంగ మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇంట్లోకి వచ్చి, గచ్చకాయంత గదిలో, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు. 

ఆ రోజు సాయంత్రానికి మిరపకాయ్ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి,  గచ్చకాయంత గదిలోకెళ్ళి,  బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి అతను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకుని, వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు.

వెంటనే, ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి వెళ్లి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని, వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని తీసుకొని మిరపకాయ పొట్టోడికి ఇచ్చి,
ఆ దోసకాయంత దొంగోడిని నాలుగు తన్ని జామకాయంత జైల్లో పడేస్తాడు.

అప్పుడు మిరపకాయ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి, తన ఈతకాయంత ఇంటికెళ్ళి, గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, దానికి తిరిగి తాటికాయంత తాళం వేస్కుని దాచేస్తాడు. 

ఇదీ కధ!   

సింగినాదం - జీలకర్ర

సింగినాదం - జీలకర్ర కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తెలుగులో కొన్ని నానుడులు అసంకల్పితంగా అనేస్తూ ఉంటాము.... కాని వాటి వెనుక ఉన్...