Wednesday, May 11, 2016

పేను - పెసర చేను కధ - Penu Pesara chenu kadha

అనగా అనగా ఒక పేను ఉంది. అది పెసర చేను వేసుకుంది. ఆ చేను బాగా ఏపుగా పెరిగింది. గుత్తులు గుత్తులుగా పెసర కాయలు కాసింది .

ఆ దారిలో ఒకరోజు ఆ ఊరి రాజుగారు వెళుతూ ఆ పెసర చేను చూసారు. "అబ్బా! చాలా బాగా పెరిగింది. " అని
ఆ చేను ఎవరిదో వాకబు చేసారు. అక్కడే ఉన్నవాళ్ళు ఆ చేను పేనుది అని చెప్పారు .

రాజుగారు వెంటనే "పేనుదా!" అని పరిహాసంగా నవ్వుతూ మొత్తం చేను భటులతో కోయించుకొని తనతో తీసుకు వెళ్లారు. రాజుగారు వెళ్ళిన కొంతసేపటికి అక్కడికి పేను వచ్చి, జరిగిన విషయం తెలుసుకొని దాని ఏపుగా పెరిగిన చేను రాజుగారు అన్యాయంగా తీసుకువెళ్ళారు అని భాద పడింది.

అప్పుడు పేను రాజుగారిమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంది. అది రాజుగారి దగ్గరకి వెళ్ళాలి అని అనుకోని - దాని పొలం లో కింద పడి మిగిలిపోయిన పెసలు ఏరుకొని నాలుగు పెసరట్లు వేసుకుంది ప్రయాణంలో తినటం కోసం.

మర్నాడు ఉదయాన్నే లేచి ఆ నాలుగు పెసరట్లు పట్టుకొని, అందులో ఒక అట్టు తింటూ ప్రయాణం మొదలు పెట్టింది. అలా వెళ్ళగా వెళ్ళగా,  దానికి ఒక తేలు కనిపించింది.

ఆ తేలు "పేను బావా, పేను బావా! ఎక్కడికి వెళుతున్నావు?" అని అడిగింది. అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసర చేను రాజుగారు కోసుకు పోయారు, మగిలిపోయిన పెసలుతో నాలుగు పెసరట్లు వేసుకొని ఒకటి తింటూ , పగ తీర్చుకోటానికి వెలుతున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో తేలు నాకూ ఒక అట్టు ఇస్తే, నీకు నేను సహాయంగా వస్తాను  అని అంది. అప్పుడు పేను దానికి ఒక అట్టు ఇచ్చింది.  పేను, తేలు కలిసి  ప్రయాణం చెయ్యటం మొదలు పెట్టాయి.

అలా వెళ్ళగా వెళ్ళగా,  వాటికి ఒక పాము కనిపించింది.
ఆ పాము "పేను బావా, తేలు బావా! ఎక్కడికి వెళుతున్నారు?" అని అడిగింది.అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసర చేను రాజుగారు కోసుకు పోయారు, మగిలిపోయిన పెసలుతో నాలుగు పెసరట్లు వేసుకొని ఒకటి తింటూ , ఒకటి తేలు కి ఇచ్చి పగ తీర్చుకోటానికి వెలుతున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో పాము నాకూ ఒక అట్టు ఇస్తే, నీకు నేను సహాయంగా వస్తాను  అని అంది. అప్పుడు పేను దానికి ఒక అట్టు ఇచ్చింది.  పేను, తేలు, పాము కలిసి  ప్రయాణం చెయ్యటం మొదలు పెట్టాయి. 

అలా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా,  వాటికి ఒక పెద్ద పులి కనిపించింది.
ఆ పెద్ద పులి "పేను బావా, తేలు బావా, పాము బావా! ఎక్కడికి వెళుతున్నారు?" అని అడిగింది.అప్పుడు పేను దాని ఏపుగా పెరిగిన పెసర చేను రాజుగారు కోసుకు పోయారు, మగిలిపోయిన పెసలుతో నాలుగు పెసరట్లు వేసుకొని ఒకటి తింటూ , ఒకటి తేలు కి ఇచ్చి, ఒకటి పాముకి ఇచ్చి, పగ తీర్చుకోటానికి వెలుతున్నాను అని చెప్పింది. వెంటనే పేనుతో పెద్ద పులి నాకూ ఒక అట్టు ఇస్తే, నీకు నేను సహాయంగా వస్తాను  అని అంది. అప్పుడు పేను దానికి ఒక అట్టు ఇచ్చింది.  పేను, తేలు, పాము, పెద్ద పులి వాటి వాటి రొట్టెలు తింటూ ప్రయాణం చేస్తూ వుండగా కొంతసేపటికి అవి రాజుగారి కోటకి చేరాయి. 

అప్పుడు పేను - తేలు, పాము, పెద్ద పులిలతో ఇలా అంది. 
"మిత్రులారా! నేను చెప్పినట్టు చెయ్యండి.  పెద్ద పులి బావా! నువ్వు కోట ముఖద్వారం దగ్గర నిలబడు, రాజుగారు ఇక్కడికి వస్తే నువ్వు నమిలి మింగేయి - పాము బావా నువ్వు ఆ కర్రల కట్ట కింద దాక్కో! రాజుగారు అటు వస్తే కరిచేయి - ఇంక తేలు బావా నువ్వు రాజుగారి అద్దం దగ్గర వున్న దువ్వెన కింద దాక్కో! రాజుగారు దువ్వెన కోసం వస్తే కుట్టేయి. "

ఇలా చెప్పి తేలు రాజుగారు పడుకునే వరకూ నిరీక్షించి అప్పుడు గడ్డం లో దూరి కుట్టడం మొదలు పెట్టింది. పేనుని వదిలించుకోటానికి రాజుగారు దువ్వెన కోసం వెళ్ళితే అక్కడ వున్న తేలు అతన్ని కుట్టింది. తేలుని చంపటానికి కర్ర కోసం రాజుగారు వెళ్లేసరికి అక్కడ వున్న పాము అతన్ని కరిచింది. పాము మంత్రం వేయించుకోటానికి కోట బయటకి వచ్చేసరికి అక్కడ వున్న పులి అతన్ని నమిలి మింగేసింది.

అలా పేను పగ తీరింది!

-------------------------

ఈ కధలో చిన్న స్థాయిలో వున్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టగలరో తెలుస్తుంది . అదే విధంగా పేను లాంటి చిన్న వాళ్ళని పెద్ద స్థాయిలో వున్నవాళ్ళు ఇబ్బందిలకి గురి చెయ్యకూడదు అని కూడా అర్ధమవుతుంది.

పేను తన పగ తీర్చుకోటానికి ఏవిధంగా తన పెసరట్లు పంచి పాము, తేలు, పెద్ద పులిలని తనవైపు తిప్పుకుందో కూడా గమనించాలి.

కధ కంచికి - మనం ఇంటికి!


సింగినాదం - జీలకర్ర

సింగినాదం - జీలకర్ర కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే తెలుగులో కొన్ని నానుడులు అసంకల్పితంగా అనేస్తూ ఉంటాము.... కాని వాటి వెనుక ఉన్...